వివాదాస్పద స్థలంపై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పద స్థలంపై విచారణ చేపట్టాలి

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

కంచిలి: కేసరపడ కాలనీలో పూర్వం నుంచి ఉన్న ప్రభుత్వ పోరంబోకు స్థలం హఠాత్తుగా జిరాయితీ స్థలంగా మారడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లు క్రితం ఇక్కడ కాలనీ మంజూరు చేసిన తర్వాత అంతటా పక్కా ఇళ్లు నిర్మించుకొని కుటుంబాలతో జీవిస్తుండటం, అందులోనే రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంకు వినియోగంలో ఉండటం, తాజాగా ప్రభుత్వ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం వంటివి సాక్ష్యాలుగా ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాలనీలో సర్వే నంబర్‌:468/2లో 16 సెంట్లు, 468/3లో 3 సెంట్లు మొత్తంగా 19 సెంట్లు స్థలం వివాదంగా మారింది. ఇందులో కాలనీ ఇళ్లు మంజూరవ్వడంతో మూడు ఇళ్లు కూడా నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. మిగతాది ఖాళీ స్థలంగా ఉంది. పూర్వం నుంచి ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగా గ్రామస్తులు వ్యవహరిస్తూ, అక్కడ కొంత భాగంలో గ్రామ అవసరాల కోసం సామాజిక మండపం నిర్మించతలపెట్టారు. దీనికోసం విరాళాలు కూడా పోగుచేసుకొని, లోతుగా ఉన్న ఈ స్థలంలో మట్టితో నింపారు. ఇంతలో ఇది జిరాయితీ స్థలం అని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేర్కొంటూ, అప్పగించాలంటూ రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్కడ ఇళ్లు నిర్మించుకొన్న వారిని విచారణ చేపట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడ కాలనీ ఇళ్లు నిర్మించుకొన్న మాలి మోహిని మహాపాత్రో, పిలక గంగమ్మ, సల్ల గంగమ్మలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తరపున విచారణ చేపట్టి, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని గ్రామానికి అప్పగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గ్రామంలో సమావేశమై విలేకరులకు తమ గోడును తెలియజేశారు. సమావేశంలో మల్లార్పు దుదిష్టి, కొరికాన కృష్ణమూర్తి, నెయ్యిల గంగాధర్‌, కొరికాన చంద్రముణి, మాలి అజిత్‌, రంగాల గోవింద్‌, పిలక కామరాజు, మల్లార్పు ప్రేమ్‌కుమార్‌, కడియం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement