రిమ్స్‌ ఆస్పత్రికి ఫిజియోథెరపీ పరికరాలు | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ ఆస్పత్రికి ఫిజియోథెరపీ పరికరాలు

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

శ్రీకాకుళం: రిమ్స్‌ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి శుక్రవారం కొత్త ఫిజియోథెరపీ పరికరాలు వచ్చాయి. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అప్పలనాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖరరెడ్డి ఈ పరికరాలను ప్రారంభించి రిమ్స్‌ ఫిజియోథెరపీ విభాగం ఇన్‌చార్జికి అప్పగించారు. పరికరాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని గతంలో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో రోగులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఇన్‌ పేషెంట్లు, అవుట్‌ పేషెంట్లకు అవసరమైన ఫిజియోథెరపీ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయని, ఎలక్ట్రో థెరపీ, వ్యాయామ చికిత్స తదితర 16 రకాలు ఇందులో ఉన్నాయని వివరించారు. వెన్నెముక, మోకాళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, పక్షవాతం, క్యాన్సర్‌, గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారికి ఇవి అవసరమన్నారు. పుట్టుకతో నడవలేని పిల్లలకు కూడా ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చిన పరికరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. రోగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్‌ విభాగం ఇన్‌చార్జి హెచ్‌ఓడీ డాక్టర్‌ పార్థసారథి, డాక్టర్‌ సుభాషిని, ఫిజియోథెరపీ వైద్యులు రవి, బాబ్జీ, విష్ణుప్రియ, ప్రశాంతి, కోరాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement