శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఇలిసిపురం పాదాలమ్మతల్లి వీధిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన బెండి సరోజ్ (60) ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. మద్యం వ్యసనంతో హింసించారనే కారణంతో పదేళ్ల క్రితమే భార్యా పిల్లలు వదిలి వెళ్లిపోయారు. నగరంలోనే వుంటున్న సరోజ్ శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేశాడు. గది గడియపెట్టుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పొగ బయటకు వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్‌ఐ హేమంత్‌కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉపాధి వేతనదారుడికి తీవ్ర గాయాలు
మెళియాపుట్టి: మండలంలోని కొత్తూరు పంచాయతీ పాత్రలోవ గ్రామానికి చెందిన సవర బాబూరావు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ పడిపోయి గాయాలపాలయ్యాడు. పాత్రలోవ గ్రామంలో కొండపై రాతికట్టల పని చేస్తూ కాలుజారి రాయిమీద నుంచి పడిపోవడంతో నుదుటి మీద తీవ్రగాయమై రక్తస్రావమైంది. క్షేత్ర సహాయకుడు బాలకృష్ణ 108కు ఫోన్‌చేసి తోటికూలీల సహాయంతో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


