చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం పేదలకు కొత్త పథకాలు లేవు.. పాతవి రావడం లేదు ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం:
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి ధర్మా న ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో ఆరుగురు మత్స్యకారులపై ప్రభుత్వం కక్ష కట్టి వారి ఇళ్లను అప్పగించకపోగా.. గురువారం ఆయన గ్రామానికి వెళ్లి ఆరుగురు మత్స్యకారులతో దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కొత్త సంక్షేమ పథకాలను ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చి న వాటిని కూడా వెనక్కి లాక్కుంటున్నారని, అలాంటి పరిస్థితే కుందువానిపేటలో నెలకొందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కుందువానిపేట గ్రామంలో 147 ఇళ్లు నిర్మించి పేదలైన మత్స్యకారులకు ఇచ్చారని తెలిపారు. వీరిలో ఆరుగురు లబ్ధిదారులు అనివార్య కారణాల వల్ల ఇళ్లను అప్పట్లో స్వాధీనం చేసుకోలేకపోయారని, అయితే వారికి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఈ ఆరుగురిని ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయనీయకుండా చేశారని, అధికారులతో అల్లరి పెట్టించారని తెలిపారు. ఈ కారణంగానే తాము దగ్గర ఉండి పేదలకు ఇళ్లు అప్పగించినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ హ యాంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, చంద్రబాబు రెండేళ్ల వ్యవధిలో ఒక్క ఎకరా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తానంటూ చంద్రబాబు జిల్లా వస్తున్నారని, ఆయన మరో మూడేళ్లు ఇలా నే ప్రజలను మభ్య పెడుతుంటారని చురకలు అంటించారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రులు ఎంత బలోపేతమయ్యాయో అందరికీ తెలుసని, ఇప్పుడు చంద్రబాబు వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారని, టెక్కలి ఆస్పత్రే దానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ 17 వైద్య కాలేజీలు మంజూరు చేస్తే వాటినీ ప్రైవేటీకరించడానికి చూశారన్నారు. గడిచిన వారం రోజులుగా కలెక్టర్ నరసన్నపేట వెళ్లి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, మరి జిల్లా పరిపాలన ఎవరు చూస్తారని సూటి గా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆనవాళ్లను చెరిపేయాలనే దురుద్దేశంతోనే సచివాలయాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు గత ప్రభుత్వ హయాంలో గుండె మీద చెయ్యి వేసుకుని ఉండేవారని, ఇప్పుడు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని తెలిపారు.
ఎరువులు కూడా నల్ల బజారుకు తరలిపోతున్నాయని, రెట్టింపు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.1000 కోట్లయినా జిల్లాకు కేటాయించారా అని ప్రశ్నించారు. కుందువానిపేటలో ఇప్పటికీ 60 మందికి మత్స్యకార భరోసా మంజూరు కానట్లు తనకు దృష్టికి వచ్చిందన్నారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్‌కు వైఎస్ జగన్ పునాది వేస్తే.. చంద్రబాబు ప్రభు త్వం దాన్ని నిలిపివేసిందన్నారు. పార్టీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో వచ్చిన సంక్షేమ పథకా లు ప్రస్తుతం రెండేళ్లుగా పడుతున్న కష్టాలు బేరీజు వేసుకొని భవిష్యత్‌లో ఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ మండలం ఎంపీపీ అంబటి నిర్మల, జెడ్పీటీసీ రుప్ప దివ్య, గార ఎంపీపీ గొండు రఘురాం, గేదెల పురుషోత్తం, చల్ల రవి, తాతబాబు, సూర్యం, పొన్నాడ రుషి, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


