చెస్‌తో మెదడుకు పదును | - | Sakshi
Sakshi News home page

చెస్‌తో మెదడుకు పదును

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

చెస్‌తో మెదడుకు పదును

శ్రీకాకుళంలో ప్రారంభమైన

ఇంటర్నేషనల్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ పోటీలు

150 మంది ఇంటర్నేషనల్‌ రేటెడ్‌ ప్లేయర్లతో కలిపి 335 మంది హాజరు

శ్రీకాకుళం న్యూకాలనీ : చెస్‌తో మెదడుకు పదును పెరుగుతుందని.. చదరంగం క్రీడాకారులు వారి జీవితాల్లో ఉన్నతంగా ఆలోచనలు చేయగలుగుతారని జీఎంఆర్‌ ఐటీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.గిరీష్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం పెద్దపాడు రోడ్‌లో ఉన్న గ్రాండ్‌ కన్వెన్షన్‌ వేదికగా జరుగుతున్న ఐదు రోజుల ఇంటర్నేషనల్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు–2026 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎస్‌ఎన్‌ ట్రస్ట్‌, గీతా చెస్‌ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను గ్రూప్‌–1 సెలెక్టడ్‌ డీఎస్పీ చౌదరి గౌరీతో కలిసి వీసీ గిరీష్‌ మొదటి ఎత్తువేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఇటువంటి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌ పోటీలు శ్రీకాకుళంలో జరగడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. టోర్నీ నిర్వహణ ఏర్పాట్లు, చెస్‌ క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోర్నమెంట్‌ డైరెక్టర్‌ సనపల భీమారావు వివరించారు.

రూ.5లక్షల నగదు బహుమతులు..

పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.5 లక్ష ల నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ టోర్నమెంట్‌లో 150 మంది ఇంటర్నేషనల్‌ రేటెడ్‌ ప్లేయర్లతో పాటు మొత్తం 335 మంది చెస్‌ క్రీడాకారులు దేశ నలుమూలల నుంచి హాజరయ్యారని టోర్నీ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ టి.సుధీర్‌ వెల్లడించారు. ఈ పోటీలకు పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు, ఊన్న నాగరాజు, సీఎస్‌ఎన్‌ ట్రస్ట్‌ ట్రస్టీ తాండ్ర సునీల్‌, ఎంజే సోలార్‌ జయరాజు, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బగాది కిషోర్‌ హాజరై క్రీడాకారులను దీవించారు. ఇటువంటి ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌ మన జిల్లాలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, ఈ పోటీల్లో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement