శ్రీకాకుళం అర్బన్: సహకార సంఘ ఉద్యోగులకు నష్టం చేసే జీఓ 322ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాధ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ తదితరులు డిమాండ్ చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు గురువారం శ్రీకాకుళం డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 49 సంఘాలకు చెందిన ఉద్యోగులు జీఓ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరికీ సమన్యాయం జరిగేలా జీవోను మార్పు చేసి, ‘కెపాసిటీ టు పే’ అనే నిబంధనను పూర్తిగా తొలగించాలని కోరారు. గతంలో ఉద్యోగులు చేసిన సమ్మె సందర్భంగా కమిషనర్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్‌సీ ఇవ్వాలని, గ్రాట్యుటీ పెంచాలని, 2019 తరువాత జాయినైన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డీసీసీబీ సీఈవోకు, జిల్లా సహకార అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా పీఏసీఎస్ ఉద్యోగులు యూనియన్ నాయకులు బల్లెడ రామారావు, సన్యాసిరావు, లక్ష్మీనారాయణ, దాసు, శ్రీనుబాబు, పడాల రఘు, సత్యనారాయణ జానకి తదితరులు పాల్గొన్నారు.


