లారీని ఢీకొన్న బొలెరో వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బొలెరో వ్యాన్‌

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

లారీని ఢీకొన్న బొలెరో వ్యాన్‌ ● ఇద్దరు ఒడిశా వాసుల దుర్మరణం

నందిగాం: కొండతెంబూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరాపుట్‌ జిల్లా సెమిలిగూడ పంచాయతీ గోపబంధునగర్‌కు చెందిన నిరంజన్‌ దొలయ్‌ (67) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొరాపుట్‌ నుంచి బరంపురం పట్టణానికి కూరగాయలను గంజాం జిల్లా కరాచులీకు చెందిన ఆరతానాయక్‌ బొలెరా వ్యాన్‌లో తీసుకువెళ్తుండగా గురువారం వేకువజామున నందిగాం మండలం కొండతెంబూరు వద్దకు వచ్చే సరికి వ్యాన్‌ అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి పలాస నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌ నుజ్జయిపోవడంతో డ్రైవర్‌ ఆరతానాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కన ఉన్న నిరంజన్‌దొలయ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న నందిగాం ఎస్సై షేక్‌ మహమ్మద్‌ ఆలీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిరంజన్‌ దొలయ్‌ను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుసత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందాడు. మృతుల వివరాలను బంధువులకు తెలియజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement