సిండికేట్‌ దందా | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌ దందా

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

పనిలో పనిగా కల్తీ!

పనిలో పనిగా కల్తీ!

గౌతు శిరీష

ఇలాకాలో..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

హిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో మద్యం సిండికేట్‌ బరితెగించింది. ‘తమ్ముళ్లు’ సిండికేట్‌గా మారి మందుబాబులను నిలువునా దోచేస్తున్నారు. ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేసి జేబులు నింపుకుంటున్నారు. లైసెన్సు దుకాణాల్లో కౌంటర్‌లో క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు, బార్‌లో రూ.20 నుంచి రూ.50 వరకు, బెల్ట్‌షాపుల్లో క్వార్టర్‌పై ఏకంగా రూ.50 పెంచి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అభాగ్యులు, రోగులు, అనాథల పాలిట మానవతావాది, విశ్వమాత పేరుతో విద్యా సంస్థలను నడుపుతున్న ‘బాబే’ సిండికేట్‌ బాస్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

అంతా బాబు కనుసన్నల్లో...

పలాస నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని గ్రామాలు కనిపిస్తాయి గానీ మద్యం లేని గ్రామం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. పగలు రాత్రీ తేడా లేకుండా అన్ని వేళల్లోనూ మద్యం అందుబాటులో ఉంటుంది. లైసెన్సు దుకాణాలు, బార్‌లే కాదు బెల్ట్‌షాపులు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. సిండికేట్‌ బాబు ఆధ్వర్యంలో ఇష్టారీతిన ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ఎక్కడ ఎవరెంతకు అమ్మాల్లో అంతా ఆ బాబే నిర్ణయిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన ముడుపులు వారికి అందుతుండటంతో రెచ్చిపోయి అమ్మకాలు సాగిస్తున్నారు. సమయం దాటినా లైసెన్సు దుకాణాల వెనక భాగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. ఇక బెల్ట్‌షాపుల సంగతి సరేసరి.

మహిళా ఎమ్మెల్యే ఇలాకాలో బరితెగింపు

జిల్లాలో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు ప్రారంభించిన మొదటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పలాసే. దాని తర్వాతే మిగతా ప్రాంతాల్లో అధిక ధరలు మొదలయ్యాయి. మిగతా అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే పలాస మరో ఎత్తు. ఎందుకంటే, ఇక్కడ టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మద్యం సిండికేట్‌ బరితెగించి విక్రయాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. అయినా ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు. అడపాదడపా నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఏం చేసుకుంటే చేసుకో అనే ధోరణికి వెళ్లిపోయారు. ఇక్కడ సిండికేట్‌కు కొమ్ము కాస్తున్నది పెద్దలు కావడమే కారణం. బెల్ట్‌షాపులకై తే అడ్డూ అదుపు లేకుండాపోయింది. వీధికి నాలుగైదు ఉన్న ఈ షాపుల్లో క్వార్టర్‌పై రూ.50పెంచి అమ్ముతున్నారు.

పలాసలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు

‘బాబు’ నాయకత్వంలో బరి తెగింపు

ఎమ్మార్పీకి మించి విక్రయాలతో

రూ.కోట్లలో అక్రమార్జన

క్వార్టర్‌ బాటిల్‌పై లైసెన్సు దుకాణాల్లో రూ.10 నుంచి రూ.20 పెంపు

బార్‌లు, బెల్ట్‌షాపుల్లో రూ.50 వరకు వడ్డన

అమ్మకాలు జోరుగా సాగుతుండటం, మందుబాబులను ప్రోత్సహించేలా ఎక్కడికక్కడ దుకాణాలు తెరవడంతో మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వార్డుకు వెళ్లినా ముందుగా కన్పించేవి మద్యం షాపులు, బెల్ట్‌షాపులే. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహస్య ప్రాంతాల్లో కల్తీ చేసి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి మూతలు, సీసాలు తీసుకొచ్చి, గుట్టుగా విక్రయాలు కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్‌షాపుల్లో కల్తీ మద్యాన్ని ఎక్కువగా అమ్ముతున్నారు. అక్కడైతే ఎవరూ పసిగట్టలేరని కల్తీ మద్యానికి గేట్లెత్తేశారు. రాజకీయ నాయకుల అండదండలతో రూ.కోట్లలో అక్రమంగా సిండికేట్‌ ఆర్జిస్తోంది. తలా ఇంత అని పంచుకుని, చూసీ చూడనట్టు వదిలేస్తున్న పెద్దలకు ముడుపులు ముట్ట జెప్పి తమ వ్యాపారానికి ఆటంకాలు లేకుండా చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement