దారుణం..
ఇది చాలా దారుణం. ఎన్ని కల్లో కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోంది. దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నాం. మాతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా రు. ఆందోళన కార్యక్రమాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. – మెరక పోతయ్య,
సమగ్ర శిక్ష మెసెంజర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కనీస వేతనం అమలు చేయాలి
పెరిగిన నిత్యావసర ధరలకు సరిపడా వేతనాలు మాకు లేవు. ఉద్యోగ భద్రత లేదు. సమాన పనికి సమాన వేతనమైనా అమలుచేయాలి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనం అందించి ఆదుకోవాలి. – బోర గోవిందరావు,
సీఆర్‌ఎంటీ, హిరమండలం
హిరమండలం: సమగ్ర శిక్షలో చిరుద్యోగులు సమగ్రమైన శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పనికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు. కూటమి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా సమ్మె బాట పడుతున్నారు. ఈ నెల 15 నుంచి సమ్మెను ఉద్ధృతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ఆందోళనకు హాజరయ్యేందుకు వీలుగా విద్యాశాఖ అధికారులకు సామూహిక సెలవు నోటీసులు అందజేశారు. ఒకేసారి సమగ్ర శిక్ష సిబ్బంది రోడ్డెక్కితే విద్యాశాఖకు సంబంధించి కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 1,398 మంది పనిచేస్తున్నారు. కేజీబీవీ, డీపీఓ, ఏపీసీ, ఎంఈఓ, భవిత సెంటర్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఐఈఆర్‌టీలు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయాలు, ఫిజియోథెరపిస్టులు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఇలా అందరూ సమ్మెబాట పడుతున్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మించి విద్యాశాఖలో దశాబ్దాలుగా సేవలందిస్తుంటే పనికి తగ్గ వేతనం కూడా వీరికి అందడం లేదు.
హామీలు బుట్టదాఖలు..
సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం అందిస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లవుతున్నా ఆ హామీకి అతీగతీ లేకుండా పోయింది. తీరా ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాల పెంపు తమ పరిధిలో లేదని.. అది కేంద్ర పరిధిలోనిది అంటూ దాట వేస్తున్నారు. దేశంలోనే మన రాష్ట్రంలోనే మెరుగైన వేతనాలు అందిస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పొమ్మన లేకుండా పొగపెడుతున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేసే అకౌంటెంట్లు మూడేసి చోట్ల పనిచేయాల్సి వస్తోంది. వీరికి ట్రావెలింగ్ అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. ప్రతిరోజూ వీరు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు పని సర్దుబాటు కింద సీఆర్టీలకు 100 కిలోమీటర్ల దూరంలోకి పంపిస్తున్నారు. వేతనాలు కూడా పెంచలేదు. పెరిగిన నిత్యావసరాలతో చాలీచాలని జీతాలతో ఎలా బతికేది అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణి..
సమగ్ర శిక్ష అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టు. ప్రధాన యజమాని రాష్ట్ర ప్రభుత్వమే. బడ్జెట్‌ను అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఉద్యోగుల వేతనాల పెంపు, సర్వీసు నిబంధనలు, క్రమబద్ధీకరణ, సంక్షేమ సౌకర్యాలు వంటివి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్రమే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇదే పథకం కింద కేంద్ర వాటా 60 శాతం నిధులతో పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలతో పాటు రాయితీలు ఇస్తున్నాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నెపం పెట్టి తప్పించునే ప్రయత్నం చేస్తోంది.
సమగ్ర శిక్ష ఉద్యోగులపై కత్తికట్టిన కూటమి సర్కారు
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివక్ష
సమాన పనికి సమాన వేతనం లేని వైనం
జీతాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత
పొమ్మనలేక పొగ పెడుతున్న వైనం


