● 1972లో తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా విజయం
● జీవిత చరమాంకంలో పేదరికంతో ఇబ్బంది
మెళియాపుట్టి/హిరమండలం: సాధారణంగా సర్పంచ్ అయితేనే దర్పం చూపే రోజులివి. కానీ ఓ మహిళ ఎమ్మెల్యేగా ఆరేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించినా కనీసం సరైన ఇల్లు సమకూర్చుకోలేదు. కుటుంబ జీవనం కోసం ఉపాధి పనులకు సైతం వెళ్లారు. ఆమే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే చుక్కా పగడాలమ్మ(80). బుధవారం అనారోగ్య సమస్యలు, వయోభారంతో చనిపోయారు. ఎమ్మెల్యేగా పాతపట్నం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తెచ్చిన ఆమె చివరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ తుదిశ్వాస విడిచారు. మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన పగడాలమ్మ 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఏకై క దళిత మహిళా ఎమ్మెల్యే పగడాలమ్మ కావడం విశేషం. ఆ ఎన్నికల్లో 7,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాడు ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ఉండేవారు. మహిళా ఎమ్మెల్యే కావడంతో పగడాలమ్మ పట్ల చాలా అభిమానంతో ఉండేవారు. అక్కడికి ఏడాదికే జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. నాడు జై ఆంధ్ర ఉద్యమంతో ఏడాది అదనంగా అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగించారు. దీంతో ఆరేళ్ల పాటు పాతపట్నం ఎమ్మెల్యేగా కొనసాగారు. చదువు రాకపోయినా భర్త దాసు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పాతపట్నం ఆల్ ఆంధ్రా రహదారి ఆమె హయాంలోనే నిర్మించారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి..
సాధారణ గృహిణిగా ఉన్న పగడాలమ్మకు అనూహ్య రీతిలో ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. అప్పట్లో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేది. 1972 ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అప్పటి మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాస్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీని కలుసుకునేందుకు ఢిల్లీ వెళితే అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. 1978లో పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు. కుమారులు లేకపోవడంతో చిన్నల్లుడు మాధవరావు, జయసుధల ఇంట్లోనే ఉంటున్నారు. నాలుగేళ్ల కిందట భర్త అనారోగ్యంతో మృతిచెందారు. కుటుంబ జీవనం కోసం ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ కూలీగా కూడా వెళ్లాల్సి వచ్చింది.
వైఎస్సార్ నుంచి పిలుపు..
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి గెలుపొందిన తర్వాత పగడాలమ్మకు కబురొచ్చింది. పగడాలమ్మ వెళ్లడానికి కొన్నిరోజుల ముందే ఆయన మృతిచెందడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.


