మందకొడిగా..! | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా..!

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

జిల్లాలో అంతంతమాత్రంగానే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

రెండు నెలల్లో 6,000 మందికి మాత్రమే వ్యాక్సిన్‌

అవగాహన లేమితో వ్యాక్సినేషన్‌కు దూరం

యువకులకూ వ్యాక్సినేషన్‌

శ్రీకాకుళం: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య సమస్య క్యాన్సర్‌. క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. మహిళలను తీవ్రంగా వేధిస్తున్నది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌. క్యాన్సర్‌ నివారణకు గతంలో ఎటువంటి వైద్యం గానీ, టీకాలు కానీ ఉండేవి కాదు. ఇటీవల కాలంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రాగా, తాజాగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ పేరిట వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవడం వలన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చు. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా యువతులకు అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఈ టీకా వల్ల క్యాన్సర్‌ మాత్రమే కాకుండా లైంగికంగా సంక్రమించే తొమ్మిది రకాల వైరస్‌లను అరికట్టవచ్చు. అలాగే వైజెనల్‌ క్యాన్సర్‌, పల్వర్‌ క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చు. ఈ టీకా ఖరీదు బయట మార్కెట్‌లో రూ.7,000ల నుంచి రూ.9,000ల వరకు ఉంది. రెండు డోసులు కలిగిన టీకా తొమ్మిది రకాల వైరస్‌లను, మూడు డోసులు కలిగిన టీకా ఏడు రకాల వైరస్‌ను అరికడుతుంది. అయితే బాలికలు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం, కొందరికి టీకా వలన ఏదో జరుగుతుందన్న అపోహ ఉండడం వల్ల జిల్లాలో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ టీకా కొత్తగా తీసుకొచ్చింది కాదు. 2008 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ధనిక వర్గాలు సైతం ఈ వ్యాక్సిన్‌ తీసుకోకుండా వచ్చారు. అయితే ప్రస్తుతం క్యాన్సర్‌ కేసులు ఎక్కువ అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇదీ పరిస్థితి...

శ్రీకాకుళం జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా అన్ని పీహెచ్‌సీల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ మందకొడిగా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. జిల్లాలో 14,036 మంది బాలికలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, గడిచిన రెండు నెలల్లో 6,000 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగలిగారు. వైద్యారోగ్య శాఖ ప్రచారం కూడా అంతంత మాత్రమే ఉండడం, బాలికలు తల్లిదండ్రుల్లో అనేక అపోహలు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాలికలు.. వారి తల్లిదండ్రుల్లో అపోహలు తొలగించేలా ప్రచారం చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ బాలికలకు ఎంత అవసరమో.. 17 ఏళ్ల దాటిన యువకులకూ అంతే అవసరం. యువకులు కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటే వారు తొమ్మిది రకాల వైరస్‌ల నుంచి రక్షణ పొందడంతో పాటు, వారి జీవిత భాగస్వామికి క్యాన్సర్‌ వంటి మహమ్మారిని అంటించకుండా ఉండేందుకు దోహదపడుతుంది. దీనిపై అపోహల తొలగించేందుకు గానూ ఇప్పటివరకు డాక్టర్‌ దానేటి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా 135 మందికి ఉచితంగా వ్యాక్సినేషన్‌ జరిపాను. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయం. దీనిని యువతులు సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, సీ్త్ర వైద్య నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement