సారవకోట: మండలంలోని కురిడింగి గ్రామానికి చెందిన నంబూరి భాస్కరరావు(57) బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కరరావు కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో భార్య నీలమ్మ ఉపాధి పనులకు వెళ్లగా, చిన్న కుమార్తె బయట ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా జట్టు ఎంపిక
టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ సెలక్షన్స్ నిర్వహించారు. సీనియర్ అండర్–18 బాయ్స్ అండ్ గర్‌ల్స్ ఛాంపియన్ షిప్ కోసం రగ్బీ ఎంపికలను జిల్లా అధ్యక్షుడు డొంకన రామకృష్ణ ప్రారంభించారు. దీనిలో భాగంగా మొత్తం 24 మంది క్రీడాకారులను (12 మంది బాయ్స్, 12 గర్‌ల్స్) ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాస్థాయికి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీలు పల్నాడు జిల్లా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరుగుతాయని తెలిపారు. ఈ ఎంపికల్లో జిల్లా రగ్బీ ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజేషన్ సెక్రటరీ బాడాన నారాయణరావు, ట్రెజరర్ కాపుల రఘునాధరావు, ఎస్.లక్ష్మణ్ రాజా తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి రైల్వేస్టేషన్‌కు సమీపంలో బుధవారం 45 ఏళ్లు వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. పూండి నుంచి నౌపడ వైపు వెళ్లే అవుట్ కట్స్ వద్ద ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉన్నాడని, కుడి చేతిపై సాయిరాం అని పచ్చ బొట్టు ఉన్నట్లు తెలిపారు. అలాగే తెలుపు రంగు ఫుల్ హాండ్స్ షర్టు, తెల్లటి గీతలున్న సర్ప్ కలర్ లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహం తరలించి ఉంచినట్లు వివరించారు. ఎవరైనా గుర్తిస్తే 92475 85743, 94922 50069 నంబర్లను సంప్రదించాలని కోరారు.
నేత్రదానం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగరంలోని చిన్న బరాటం వీధికి చెందిన పాలిశెట్టి జగన్నాథ (69) బుధవారం మరణించారు. దీంతో అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నేత్ర సేకరణలో భాగంగా మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమశంకర్‌ల ద్వారా అతని కార్నియాలు సేకరించి, విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఘనంగా శ్రీముఖలింగేశ్వరుడి తిరువీధి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడికి వైశాఖ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా బుధవారం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకీలో ఆశీనులుగా చేశారు. అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


