● ‘వీబీ జీ రామ్ జీ’ జూలై 1 నుంచి అమలు ● వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో వేతనం జమ ● జిల్లాలో సుమారు లక్షన్నర మంది వేతనదారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్– గ్యారంటీ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)..వీబీ జీ రామ్ జీ చట్టం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ ఒకటి) నుంచి ప్రారంభమవుతుందని భావించినా సంబంధిత పథకం సాఫ్ట్‌వేర్, ఇతర పరిస్థితులు సమకూరలేదు. ఈ నేపథ్యంలో జూలై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1,40,000 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పనులు నిర్వహిస్తున్నారు.
నేరుగా ఖాతాల్లోకి వేతనాలు..
వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి దినాల సంఖ్య మరో 25 రోజులకు పెరగనుంది. పని కోరిన వారికి నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా వేతనదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వేతనం జమ చేస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. అలస్యమైతే ఆందుకు పరిహారం సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే వీబీ జీ రామ్ జీ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.35,692.31 కోట్లను కేటాయించింది. గ్రామీణ ఉపాధి పథకాల చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ కేటాయింపు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్రాలవాటా తప్పని సరిగా ఉండాలి. ఈ రెండు వాటాలతో కలిపే బిల్లు చెల్లింపులు జరుగుతాయి.
పనులు యథాతథం..
ఇప్పటికే చేపట్టిన పాత పనులు అంటే ఉపాధి హామీ పథకం ద్వారా కేటాయించి ప్రారంభించిన పనులు జూన్ 30 వరకు యధావిధిగా కొనసాగుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను కొత్త చట్టంలోకి మార్చనున్నారని, కార్మికులకు ఉపాధి, వేతనాల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదని అంటున్నారు. కొత్త చట్టంలో రోజ్‌గర్ కార్డులు వచ్చేంతవరకు ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డులే అమల్లో ఉంటాయని పేర్కొంటున్నారు.


