రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

ఎచ్చెర్ల: మండలంలో అల్లినగరం జంక్షన్‌ సమీపంలోని వేబ్రిడ్జి ఎదురుగా బుధవారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలంలోని రొంపివలస గ్రామానికి చెందిన మహంతి తిరుపతిరావు (33) అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుపతిరావు కుమార్తెకు బాగులేదని మంగళవారం రాత్రి శ్రీకాకుళం ఆస్పత్రికి వెళ్లి, బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 8.30 గంటల సమయంలో అల్లినగరం వేబ్రిడ్జి ఎదురుగా రోడ్డు క్రాస్‌ చేస్తుండగా, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తిరుపతిరావుకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108 ద్వారా రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతిరావుకు భార్య సీతతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్లక్ష్యంగా కారు నడపడంతో...

వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడలో బుధవారం వేకువజామున కారు ఢీకొన్న ప్రమాదంలో సారవకోట మండలం సవరబెజ్జి గ్రామానికి చెందిన చౌదరి సింహాచలం(21) అక్కడికక్కడే మృతి చెందాడు. రెళ్ల ఆనంద్‌ అనే వ్యక్తి కారును నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదం జరిగినట్లు వజ్రపుకొత్తూరు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. దేవునల్తాడ గ్రామంలో మంగళవారం పెద్దమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ తేదీ రాత్రి దేవుల్తాడ సముద్ర తీరం వద్ద స్టేజీ ప్రోగ్రాం జరిగింది. మృతుడు తన అత్త మణిరత్నం గ్రామమైన పూండి– గోవిందపురం పంచాయతీ మెట్టపేట(సీతంపేట) వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు జి.తేజేశ్వరరావు, సవర గౌతమ్‌లతో కలిసి స్టేజీ ప్రోగాం చూసేందుకు దేవునల్తాడ వెళ్లారు. మృతుడు సింహాచలం స్టేజీ ప్రోగ్రాం చూస్తూ అక్కడే ఉన్న సీసీ రోడ్డు పక్కన నిద్రలోకి జారుకున్నాడు. ఇది గమనించకుండా నిందితుడు రెళ్ల ఆనంద్‌ సీసీ రోడ్డుపై నిద్రిస్తున్న చౌదరి సింహాచలం చాతిపై నుంచి మితిమీరిన వేగంతో కారును నిర్లక్ష్యంగా నడపడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సింహాచలం ఐటీఐ చదువుతున్నాడని తెలిపారు. దీంతో దేవునల్తాడ చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోదించారు. మృతుని తండ్రి చౌదరి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం పలాస ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వైకుంఠరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement