ప్రసాదమా.. అపచారమా!
అరసవల్లి: ఆలయాల్లో తయారు చేసిన పులిహోర, లడ్డూలను దేవునికి ముందుగా నివేదించిన తర్వాతే అవి ప్రసాదాలుగా భావించి భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు.. నలుగురికి పంచుతారు కూడా..! ఇదే హిందూ సంప్రదాయంలో భాగం. కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ విధానం కొన్నాళ్లుగా కనిపించడం లేదు. గతంలో ముందుగా స్వామి వారికి నివేదించి ప్రసాదాల పేరిట విక్రయాలు చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
దేవునికి నివేదించకుండానే విక్రయాలా..!
ఆలయాల్లో బ్రాహ్మణ వంట పంతులు కచ్చితంగా దేవునికి ప్రసాదాలను తయారు చేయాల్సి ఉంది. ఈయన ఆధ్వర్యంలోనే దిట్టం ప్రకారం నాణ్యమైన రసవర్గాలతో తయారు చేసిన పులిహోర, లడ్డూలను రోజూ గర్భాలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు నివేదించాల్సి ఉంది. అయితే బ్రాహ్మణ వంట పంతులు నియామకం జరగకపోవడంతో ఇప్పటికే ఆలయ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట పంతులు చేతుల మీదుగా స్వామికి నివేదించిన నివేదనా వస్తువులే ప్రసాదంగా మారుతుంది. వీటిని అప్పటికే సిద్ధమైన తయారి పులిహోర లడ్డూ పూసలో కలుపుతారు. దీంతో మొత్తం ఈ పదార్థాలన్నీ ప్రసాదాలుగా ప్యాకెట్లకు సర్దేసి భక్తులకు విక్రయాలు చేయాల్సి ఉంది. ఇదే విధానం గత ప్రభుత్వ పాలన వరకు అరసవల్లిలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత అన్నదాన ప్రసాదాల మండపాలన్నీ కూల్చివేయడంతో ప్రసాదాలను నివేదించే సంప్రదాయం కూడా కనుమరుగైంది. రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతులు నియామకాలు జరుగకపోవడంతో తయారు వస్తువులను ప్రసాదాలుగా నివేదించే నాథుడే కరువయ్యాడు.
నమూనా విగ్రహానికి నివేదిస్తూ...!
ఆలయ వర్గాలు భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండేలా వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అలంకారంగా ఉన్న నమూనా ఆదిత్యుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వద్ద రోజూ ఇక్కడ తయారు చేసిన పులిహోర, లడ్డూలతో పాటు అన్నం, కూరలను కూడా నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి అసలైన మూలవిరాట్టుకు మాత్రమే ప్రసాదాలు, భోగాన్ని నివేదించాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఇదెక్కడి సంప్రదాయమంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు బ్రాహ్మణ సామాజిక వంట పంతులును నియమించి ఆయన ద్వారా స్వామి వారికి ప్రసాదాలను తయారు చేయించి నేరుగా స్వామివారి గర్భాలయంలోనే నివేదించి ఆ తర్వాతే ప్రసాదాల విక్రయాలకు సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు.
అరసవల్లిలో దేవునికి నివేదించకుండానే లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు
నమూనా విగ్రహానికి నివేదన చేయడంపై విమర్శలు
ఇదేం పద్ధతంటూ భక్తుల మండిపాటు
గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన వైనం
శాశ్వత భవనాల కూల్చివేతతో
సంప్రదాయాలకు మంగళం
నివేదించకపోతే ఎలా?
స్వామికి నివేదించకుండా పులిహోర, లడ్డూలను విక్రయించడం దారుణం. అలా చేస్తే అవి ప్రసాదాలే కాదు. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే వస్తువులుగానే చూడాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవస్థలు పని చేయకూడదు.
– శ్రీపతి మురళీరావు, శ్రీకాకుళం
ప్రసాదమా.. అపచారమా!
ప్రసాదమా.. అపచారమా!


