● నేటి నుంచే రట్టి వల్లభ నారాయణుడి యాత్ర
మందస: ఉద్దానం ప్రాంతమైన మందస మండలం రట్టి గ్రామంలో వల్లభనారాయణుడి రట్టియాత్ర ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. సింహాచలంలో సింహాద్రి అప్నన్న, రట్టిలో వెలసిన వల్లభనారాయణ స్వామి ఒక్కరేనని ఇక్కడి భక్తుల నమ్మకం. జిల్లాతో పాటు ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు అంకురార్పణ, 27న పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, 28న ధ్వజారోహణ, విశేణ హోమాలు, మార్చి 1న తిరువీధి మహోత్సవాలు, 2న స్వామివారికి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 3న డోలో పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం, మఘ, కామదానం, కోలసేవ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడి వివేకానంద యువజన సేవా సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎంతో ప్రత్యేకత..
ఆలయ ప్రాంగణంలోని గరుడ స్తంభాన్ని నూతన దంపతులు ఆలింగనం చేసుకుంటే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దేవుని సన్నిధి లో ఉన్న తులసికోట వద్ద చాలామంది నేస్తరికం కట్టుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు వేర్వేరు చోట్ల పుణ్య క్షేత్రాలు దర్శించి చివరిగా మత్స్యవల్లభనారాయణ స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ యాత్ర చేసినట్లు అవుతుందని ప్రగాఢ
నమ్మకం.
● నేటి నుంచే రట్టి వల్లభ నారాయణుడి యాత్ర


