విశాఖ డెయిరీలో తనిఖీలు
టెక్కలి: టెక్కలి విశాఖ డెయిరీలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కల్తీ పాల వ్యవహారంపై స్థానికంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను సేకరించారు. ఎక్కడైనా ఆహారం కల్తీ జరిగినట్లు తెలిస్తే తక్షణమే సమాచారం అందజేయాలని వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
మందస: బాలిగాం జంక్షన్ జాతీయ రహదారిపై రెండు వ్యాన్‌లలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. ఒక బండిలో ఆరు పశువులు, మరో బండిలో ఏడు పశువులు మొత్తం 13 పశువులు పట్టుకుని వాహనాలపై కేసులు నమోదుచేసి గోశాలకు తరలించారు.
ఇంటర్ పరీక్షలకు 737 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 71 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు సెట్–1తో కూడిన ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 20,364 (96.51శాతం) మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 737 మంది గైర్హాజరయ్యారు. జిల్లా అధికారులతోపాటు డీఈసీ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వేరువేరుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. అయితే జిల్లాలో 71 కేంద్రాలకుగాను బుధవారం 42 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. సీసీ కెమెరాల స్ట్రీమింగ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్ష రోజున జిల్లాలో ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని జిల్లా ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ ధ్రువీకరించారు.
విశాఖ డెయిరీలో తనిఖీలు


