కుటుంబానికి సాయంగా లేనని..
● మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీలో బుధవారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యడగళ్ల పవన్‌కుమార్ (26) వాంబేకాలనీలోని రాజీవ్ గృహకల్పలో 9వ నెంబరు బ్లాక్‌లో తల్లి తిరుమలతో కలసి నివాసముంటున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్తూ, చీకులు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. పవన్ ఆటో నడుపుతుండగా అతని సోదరుడు నగరంలో ఓ వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఆటోకి సరిగా బేరాలు రావడంలేదని, చిన్నపాటి ఉద్యోగముంటే బాగుండేదని, కుటుంబానికి సాయం చేయలేకపోతున్నానని ఇటీవల తల్లి వద్ద పవన్ అనేవాడు. ఆ క్రమంలోనే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిన పవన్ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు, తెలిసినవారందరికీ వాకబు చేసినా ఫలితం లేదు. బుధవారం ఉదయం అదే వాంబేకాలనీ రాజీవ్‌గృహకల్ప 17వ బ్లాకులో పవన్.. చీరతో ఉరివేసుకుని ఉండటం స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా పవన్ కొన్ని కేసుల్లో నిందితుడిగా, సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు.


