‘ఎనర్జీ’ తగ్గిపోతోంది..!
● పనిభారంతో నీరసించిపోతున్న ఎనర్జీ అసిస్టెంట్లు
● సర్వేలకు వీరిని వినియోగిస్తున్న వైనం
హిరమండలం: కటింగ్ ప్లయర్, టెస్టర్ పట్టుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాల్సిన జేఎల్‌ఎం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లపై ప్రభుత్వం పెను భారం మోపుతోంది. వలంటీర్లు చేయాల్సిన ఇంటింటి సర్వేకు వీరిని వినియోగిస్తోంది. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
నాడు సజావుగా..
జిల్లాలో సుమారు 660 మంది జేఎల్‌ఎం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారు. వీరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పగలు రాత్రనే తేడా లేకుండా విద్యుత్ సంబంధిత బ్రేక్‌డౌన్, డీటీఆర్ మెయింటెనెన్స్, డీలిస్టు, అగ్రికల్చర్, స్ట్రీట్‌లైట్ రీడింగ్‌లు సర్వీస్ కంప్లెంట్స్, లైన్ కింద ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ వంటి పనులు చేసేవారు. అధికారికంగా ఎలాంటి సెలవులు లేకుండా విద్యుత్ సంస్థలో వీరు పనిచేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడం, లైన్లు పునరుద్ధరణలో కొందరు ప్రమాదాలకు కొందరు గురికాగా మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ తరుణంలో 2022లో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరందరినీ క్రమబద్ధీకరించి జీవితాల్లో వెలుగులు నింపారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వీరిని సర్వేలకు పురమాయించడంతో విద్యుత్ సరఫరా అంతరాయాలు ఏర్పడేటప్పుడు పునరుద్ధరణ సకా లంలో జరగడం లేదు. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బంది తప్పడం లేదు. వీరిని ఇతర పనులను అప్పజెప్పకుండా విద్యుత్ అవసరాల కోసం వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.


