జాగ్రత్తండోయ్!
సందేశాల పేరుతో సైబర్ కేటుగాళ్ల వల
ప్రయాణాల వేళ పిల్లలు జాగ్రత్త
విలువైన వస్తువులు ధరించకపోవడం ఉత్తమం
గొలుసులు, పుస్తెల తాళ్లే వారి టార్గెట్
సూచనలు పాటించండి..
పండక్కి..
శ్రీకాకుళం క్రైమ్ : పెద్ద పండగ వచ్చేస్తోంది. పట్టణాల నుంచి అంతా పల్లెదారి పడుతున్నారు. ఈ పండగకు కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పండగ సంతోషమయంగా జరుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఆటో ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నారు.
దృష్టి మరలిస్తారు..
పండగ వేళల్లో ప్రజలు ఎక్కువగా షాపింగ్, సినిమాలు, బీచ్ షికార్లు వైపు మొగ్గుతారు. నగరాల్లో ఇదే అదను చూసుకున్న కత్తెరగాళ్లు మన దృష్టిని మరల్చి అలవోకగా చేతిపర్సుల నుంచి విలువైన వస్తువులన్నీ దోచే స్తారు. కొంతమంది బైక్‌లపై వస్తూ నడుస్తూ వెళ్తున్న మహిళల మెడలనే టార్గెట్టుగా చేసేకుని గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుకుపోతారు.
A ఈ నెల5న ఆమదాలవలస చంద్రయ్యపేటలో కరణం సుమిత్ర మెడలో రెండున్నర తులాల పుస్తెలతాడును కత్తితో బెదిరించి మరీ పట్టుకుపోయారు.
A ఈ నెల 6న లావేరు మండల బెజ్జిపురంలో కలిశెట్టి సూరమ్మ మెడలో 2 తులాల పుస్తల తాడు ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు తెంపుకుపోయారు.
A ఈ నెల 8న బూర్జ మండలం అడ్డూరిపేటలో పెద్ద తుంపమ్మ మెడలో 3 తులాల గొలుసు ద్విచక్రవాహనంపై వచ్చిన యువకులు తెంపేశారు.
ఏటీఎం సెంటర్ల వద్ద కూడా..
పండగ రద్దీనే ఆసరాగా చేసుకున్న ఏటీఎం చోరులు పరిసర ప్రాంతాల్లోనే పొంచి ఉంటారు. నడివయస్కులు, వృద్ధులు, అమాయకుల్లా కనిపించేవారిని గమనించి ఏటీఎంలోకి వారు డబ్బులు తీసేందుకు వెళ్లగానే వారి వెనుకగా వెళ్తారు. పిన్ నంబర్ కనిపెట్టి మాటలతో మభ్యపెట్టి దృష్టి ఏమార్చి మన ఏటీఎం కార్డు నొక్కేస్తారు. మనకు వారిది ఇచ్చేస్తారు.
A ఇదే తరహాలో గత నెల 31న జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ గ్యారేజీ ఇన్‌చార్జి అయిన దుప్పల గణపతిరావు ఖాతా నుంచి ఓ వ్యక్తి రూ. 18 వేలు టోకరా వేశాడు.
సందేశాలతో సైబర్ వల..
సంక్రాంతి విషెష్ పేరిట మన మొబైళ్లకు వివిధ రకాల ఆకర్షణీయ సందేశాలు సైబర్ కేటుగాళ్లు పంపిస్తారు. సందేశాల కింద గీత వచ్చినా, వెబ్‌సైట్ లింక్ వచ్చినా మనం జాగ్రత్త పడాల్సిందే. క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ మనల్ని అడిగి మన బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో ఊడ్చేస్తారు.
A జిల్లాకేంద్రంలో ఇటీవల ఓ రెస్టారెంట్ యజమానికి సందేశాలతో సైబరాసురులు గుండె ఆగినంత పనిచేశారు. ఓ సారి క్రెడిట్ కార్డు పెండింగ్ పేమెంట్ అంటూ రూ. లక్షల్లో వేయమని, మరోసారి చలానా అమౌంట్ కట్టాలి.. ఈ లింక్ క్లిక్‌చేయండంటూ బెదిరించసాగారు.
ప్రయాణాల వేళ..
పండగ వేళ సొంత గ్రామాలకు వెళ్లే వారు, పట్టణాలకు వచ్చేవారు లగేజీ బ్యాగులతో, షాపింగ్ సందడులతో పిల్లలను వెంటబెట్టుకు వచ్చినా కొన్నిసార్లు వారిని పట్టించుకోకుండా మర్చిపోతారు. ఇలాంటి సమయాల్లోనే పిల్లలు తప్పిపోయే ప్రమాదముంది. దీంతో పాటు ప్రయాణ సమయాల్లో మహిళలు ఒంటిపై ఆభరణాలు ధరించకపోతే మంచిది. బస్సుల్లో, రైళ్లలో రద్దీ కారణంగా చోరీకి గురయ్యే అవకాశముంటుంది.
వాహన నిబంధనలు
తప్పనిసరి..
ప్రయాణాల్లో మితిమీరిన వేగం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, మద్యం సేవించి నడపడం, హెల్మెట్, సీట్ బెల్టు ధరించకపోవడం ప్రమాదాలకు ఆస్కారమిస్తుంది. అధిక లోడుతో ఉన్న వాహనాల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదు.
పండగకి ఊరు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచరాదు. బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు తార సపడితే పరిధిలో ఉన్న పోలీసువారికి లేదా 112కు డయల్ చేసి సమాచారమివ్వాలి. ఇంటికి సీసీ కెమెరా ఉంటే మంచిది. ఎల్‌హెచ్‌ఎంఎస్ కొరకు దగ్గరలో ఉన్న పీఎస్‌లో సంప్రదించాలి. బస్సుల్లో, రైళ్లలో, ఆటోలో గాని ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోవాలి.
– పి.ఈశ్వరరావు,
రెండో పట్టణ సీఐ, శ్రీకాకుళం
జాగ్రత్తండోయ్!
జాగ్రత్తండోయ్!
జాగ్రత్తండోయ్!
జాగ్రత్తండోయ్!
జాగ్రత్తండోయ్!
జాగ్రత్తండోయ్!


