ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు ముగుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యకరమని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలను సంక్రాంతి కానుకగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు యూనియన్ 2026 క్యాలెండర్ శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆ సంఘ జిల్లా అధ్యక్షులు చల్లా సింహాచలం అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరి
ష్కారం చూపిస్తామని ఇచ్చిన మాటలన్నీ ఒట్టి మాటలగానే మిగిలిపోయాయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 26 జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని, అధికారంలోకి తీసుకువచ్చి తప్పుచేశామని ప్రతి ఒక్క ఉద్యోగి ఆవేదనలో ఉన్నారని.. భవిష్యత్తులో తగిన మూల్యాం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, జిల్లా ఉపాధ్యక్షులు పైడి నాగేశ్వరరావు, ఏవో సుందరరావు, కె.లక్ష్మీనారాయణ, సీపీఎస్ ఉగ్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


