ఆర్మీ జవాన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్‌ మృతి

Jan 14 2026 7:12 AM | Updated on Jan 14 2026 7:12 AM

ఆర్మీ జవాన్‌ మృతి

ఆర్మీ జవాన్‌ మృతి

జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన ఆర్మీజవాన్‌ జుత్తు వెంకటరమణ(37) గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్‌లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ఢిల్లీలో ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నారు. మూడు రోజులు క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబంతో శ్రీకాకుళంలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. సోమవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందడంతో భార్య విజయ ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యలమంచిలి తీసుకొచ్చారు. వెంకటరమణకు భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులు బోడయ్య, శాంతమ్మ, సోదరుడు గోవిందరావు ఉన్నారు. ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వెంకటరమణ మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. భార్య విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కందిరీగల దాడిలో తొమ్మిది మందికి గాయాలు

రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస సమీపంలోని వరిచేను కళ్లాల వద్ద కందిరీగల దాడిలో తొమ్మది మందికి గాయాలయ్యాయి. మీసాల పెంటనాయుడుకు తీవ్ర గాయాలు కాగా, అతని భార్య కళ్యాణి, గ్రామస్తులు మీసాల రాంబాబు, మీసాల వరలక్ష్మి, క్రిష్ణవేణి, సంచాన హేమలత, సంచాన ఈశ్వరమ్మ, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెంటనాయుడు రణస్థలం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. మరో నలుగురు చికిత్స పొంది ఇంటికి చేరుకోగా, ఇంకో నలుగురు గ్రామంలోనే ప్రథమ చికిత్స పొందారు.

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

కవిటి: మండలంలోని బైరెడ్లపుట్టుగకు చెందిన బైరెడ్ల చిరంజీవి(50) తేనెటీగల దాడిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తోటల పక్కగా వస్తున్న చిరంజీవిపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడిచేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో బాధితుడిని కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కవిటి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ డ్రైవర్‌ మృత్యువాత

రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీలో డ్రైవర్‌ మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడుమూరు వద్ద లారీ ఉదయం నుంచి పక్కనే నిలిపివేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. మధ్యాహ్నం లారీ క్యాబిన్‌లోనికి చూడగా డ్రైవర్‌ నిద్రపోయి ఉన్నట్లు గమనించారు. ఎంత సేపు పిలిచినా పలకక పోవడంతో లోపలకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లావేరు పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు వచ్చి లారీ యజమానికి సమాచారం అందించారు.

డ్రైవర్‌ గోబర్థన్‌ రాయ్‌(54) ఒంటరిగా వాహనం డ్రైవింగ్‌ చేస్తూ రెండు రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌ వెళుతుండగా బుడుమూరు గ్రామానికి చేరుకునే సరికి నిద్రలోనే గుండెపోటు వచ్చి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ స్వగ్రామం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మెదినాపూర్‌ జిల్లా పూర్భా పోస్టు బ్రిందాబన్‌ చౌన్‌గా గుర్తించారు. బుడుమూరు వీఆర్వో కె.నవీన్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై పి.జగన్మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement