భూగర్భ జలాలు తోడేసే పరిశ్రమ మాకొద్దు
రణస్థలం:
వ్యవసాయానికి అన్ని రకాలుగా అడ్డంకిగా మారిన ఆక్వా బ్రూవరీస్ పరిశ్రమను తమ పొలాల్లో ఏర్పాటు చేయవద్దని రణస్థలం పంచాయతీకి చెందిన 50 మంది రైతులు మంగళవారంకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. మూడు నెలలుగా పరిశ్రమ నిర్మించవద్దని, ఎన్ని విధాలుగా చెప్పినా పరిశ్రమ యాజమాన్య ప్రతినిధి ఎన్.రవికిరణ్ మొండిగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇటీవల రౌడీమూకల ద్వారా రైతులపై దాడికి పాల్పడినట్లు వివరించారు. పరిశ్రమ నిర్మిస్తున్న ప్రదేశంలో తమ గ్రామానికి చెందిన బొద్దవాని చెరువు, ఇతర చెరువులకు వెళ్లే భారీ నీటి వాగు ఉందని, ఆ వాగును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. చెరువులకు నీరు చేరకుంటే సాగుకు ఇబ్బందులు ఎదురౌతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయ సాగుకు బోర్లు వేసుకుంటే సుమారు 140 అడుగుల వరకు మాత్రమే వేస్తామని, అదే కంపెనీ నిర్వాహకులు 350 అడుగుల లోతు వరకు తవ్వారని, భారీగా నీటిని తోడేస్తే మా వ్యవసాయ బోర్లకు నీటి మట్టం తగ్గిపోయి పచ్చని భూములు బీడు భూములుగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రణస్థలం మాజీ సర్పంచ్ కరిమజ్జి భాస్కరరావు, గ్రామపెద్దలు కరిమజ్జి మల్లేశ్వరరావు, మజ్జి రమేష్, చందక రమణ, కరిమజ్జి రామినాయుడు, గ్రామ రైతులు పాల్గొన్నారు.


