అలరించిన కళాజాత
సోంపేట: మండలంలోని మామిడిపల్లి పంచాయతీ రాజాం గ్రామంలో సంక్రాంతి సందడి ముందుగానే నెలకొంది. సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన కళాజాత ప్రజలను అలరించింది. రాష్ట్రంలోని పలువురు కళాకారులు కళాజాతలో పాల్గొని తమ జానపద కళలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ.. కళలను ప్రోత్సహించడం, కళాకారులను గుర్తించడం అభినందనీయమన్నారు. కళలకు పుట్టినిల్లు ఉద్దానమని, కళాకారులు, కళలను ప్రోత్సహించి భావితరాలకు జానపద చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్, సాహిత్య వేదిక ప్రతినిధి కుమార్ నాయక్, ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, తడక జోగారావు, పిన్నింటి ఈశ్వరరావు, దున్న మాధవరావు, లింగరాజు, బట్టి మాధవరావు తదితులు పాల్గొన్నారు.


