పునరావాసం.. సమస్యలతో సావాసం..!
అభివృద్ధి ఏదీ..?
హిరమండలం: వంశధార.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు నిర్వాసితులు. ఎందుకంటే వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ కోసం వారు సర్వం త్యాగం చేశారు. అయితే వారి త్యాగాలకు ఎనిమిదేళ్లవుతున్నా.. సమస్యలు ఇంతవరకూ పరిష్కారం కాలేదు. వారికి శాశ్వత ఉపాధి కల్పిస్తామన్న మాట కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ నిర్వాసిత గ్రామాలు, పునరావాస గ్రామాల్లోని ప్రజలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జలయజ్ఞంలో భాగంగా వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి మహానేత
వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేశారు. దీనిలో భాగంగా హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఇళ స్థలాలు మంజూరు చేశారు. అయితే కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో సర్దుబాటు చేసిన పునరావాస కాలనీల్లో ఇప్పటికీ వసతులు మెరుగుపడలేదు.
ఏడేళ్ల క్రితం స్వగ్రామాలను విడిచి పునరావాస గ్రామాల్లో నిర్వాసితులు చేరారు. కానీ ఇప్పటికీ పునరావాస కాలనీలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
సుబలాయి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ముస్లింలకు ఇప్పటికీ శ్మశానవాటిక లేదు.
గూనభద్ర ఆర్‌అండ్‌ఆర్ కాలనీ శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రోడ్డుమార్గం లేదు.
పాడలి, దుగ్గుపురం, ఇరపాడు, గార్లపాడు పరిధిలో సుమారు 1,500 ఎకరాల సాగుభూమికి నీటి సదుపాయం లేదు. ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న హామీ కార్యరూపం దా
ల్చడం లేదు.
నిర్వాసిత యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులకు అదనపు పరిహారం సుమారు రూ.216 కోట్లకు పైగా మంజూరు చేశారు. అయితే సాంకేతిక లోపంతో పాటు ఎన్నికల కోడ్ రావడంతో 20 శాతం మందికి అదనపు పరిహారం అందలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితులు అదనపు పరిహారం అందనివారికి అందించాలని అధికారులు, పాలకులకు విన్నవించినా ఫలితం లేదు.
మరోవైపు నిర్వాసితులు ఇళ్ల స్థలాలు ఖాళీ చేసే క్రమంలో దాదాపు 1,250 మందిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఏళ్ల తరబడి ఈ సమస్యపై ఎదురుచూపులు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు.


