మాజీ మంత్రి గుండ మృతి
పలువురి సంతాపం
శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ(77) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆదివారం ఆయన ప్రమాదవశాత్తు పడిపోయి తలకు గాయం కావడంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రివైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి అరసవల్లిలో ఉన్నటువంటి స్వగృహానికి తరలించారు. పిల్లలిద్దరూ అమెరికా నుంచి శ్రీకాకుళం చేరుకోనున్నారు. మంగళవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు చెబుతున్నారు.
గుండ అప్పల సూర్యనా రాయణ 1948 జనవరి 16న ఓ సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. అరసవల్లికి చెందిన గుండ అప్పన్నమ్మ, సిమ్మన్న దంపతులు ఈయన తల్లిదండ్రులు. అప్పలసూర్యనారాయణ విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఉండేవారు. నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలోనే విద్యార్థి సంఘ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా సేవలందించి కొద్దికాలంలోనే పేదల న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. మున్సిపల్ వైస్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో ఇండిపెండెంట్‌గా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11 వేలకు పైగా ఓట్లను పొందారు. 1985లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1989, 1994, 1999లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో సీ్త్ర, శిశు సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. చంద్రబాబు హయాంలో ప్యానల్ స్పీకర్‌గా, ఎథిక్స్ కమిటీ సభ్యునిగా, సింహాచలం దేవస్థానం అసెంబ్లీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
అప్పలసూర్య నారాయణ మృతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన ఆయన, నిబద్ధతతో సుదీర్ఘకాలం శాసన సభ్యునిగా పనిచేశారన్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత గుంట రెడ్డి స్వామినాయుడు, డీసీఎంస్ మాజీ చైర్మన్ గుండ కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం తదితరులు సంతాపం తెలిపారు.
మాజీ మంత్రి గుండ మృతి


