ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి

Jan 13 2026 5:40 AM | Updated on Jan 13 2026 5:40 AM

ఎస్సీ

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అర్హులకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలని జిల్లా దళిత ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్‌ దుర్గాసి గణేష్‌, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా నాయకుడు రాకోటి రాంబాబు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు బైరి ధనరాజ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఎస్సీ కులాలకు రాయితీ రుణాలు అందజేయడం లేదని, కనీసం సంక్షేమం కూడా పట్టించుకోవడం లేదన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం యాక్షన్‌ ప్లాన్‌ ఇచ్చి, నమోదు చేసుకున్న తర్వాత రద్దు చేసి నేటికీ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే రుణాల మంజూరు నోటిఫికేషన్‌ విడు దల చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సైనికా.. సెలవిక

నరసన్నపేట: ఆర్మీలో సుబేదార్‌ మేజర్‌గా పనిచేస్తూ గుండెపోటుతో మరణించిన పతివాడ భూషణరావు మృతదేహానికి స్వగ్రామం కామేశ్వరిపేటలో అధికార లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని లే సెక్టార్‌లో సుబేదార్‌ మేజర్‌గా పనిచేస్తుండగా గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రికి మృతదేహం కామేశ్వరిపేటకు చేరుకోగా.. సోమవారం ఉదయం ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేపట్టారు. కామేశ్వరిపేట గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాగా తల్లిదండ్రులు అప్పన్న, రాధ, భార్య సుజాత, పిల్లలు బిందు, శశిలను పలువురు పరామర్శించారు.

నిత్యావసర సరుకులు అందజేత

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఖ్యాతి ఫౌండేషన్‌ ఓల్డేజ్‌ హోమ్‌లో ఉన్న నిరుపేద వృద్ధులకు గ్రేస్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ బృందం సభ్యులు దుస్తులు, నిత్యావసర సరుకులను సంక్రాంతి పురస్కరించుకొని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ బృందం సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలు, అనాథలకు చేతనైన సాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆకలితో అలమటించేవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హేమలత, జనార్ధనరావు, విజయలక్ష్మి, తేజేశ్వరరావు, వెంకటరమణ, పాలకొండ రమణ, గోవిందరాజులు, కృష్ణ, సోమేశ్వరరావు, అమృత, డాక్టర్‌ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

అంపైర్‌గా సూరిబాబు నియామకం

శ్రీకాకుళం న్యూకాలనీ: వరల్డ్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు అంపైర్‌గా జిల్లాకు చెందిన సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ సంపతిరావు సూరిబాబు నియామకమయ్యారు. ఈ మేరకు బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వర్తమానం అందుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఈనెల 13 నుంచి 18 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని టాప్‌ 32 మంది షట్లర్స్‌ పాల్గొంటున్నారు. ఇండియాలో ఈ మెగా టోర్నీ (సూపర్‌ 1000) మొదటిసారిగా జరుగుతుండగా.. ప్రైజ్‌మనీగా రూ.10 కోట్లకు పైగా అందజేయనున్నారు. కాగా సూరిబాబు ఎచ్చెర్ల మండల పరిధిలోని చిలకపాలేం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఎస్‌ఏ పీఈ (పీడీ)గా పనిచేస్తున్నారు. ఈయన జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సీఈవోగా పనిచేస్తుండగా.. ఒలింపిక్‌ అసోసియేషన్‌, పీడీ–పీఈటీ సంఘంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. అంపైర్‌గా సూరిబాబు నియామకంపై జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిళ్లంశెట్టి సాగర్‌, చీఫ్‌ పేట్రన్‌ డాక్టర్‌ గూడెన సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్‌, దామోదర్‌, గురుగుబెల్లి ప్రసాద్‌, రత్నాజీ, అనిల్‌కుమార్‌, చిలకపాలేం హైస్కూల్‌ హెచ్‌ఎం చౌదరి లీలావతి కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి 1
1/3

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి 2
2/3

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి 3
3/3

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement