ఎస్పీ గ్రీవెన్సుకు 37 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు 37 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ కేవీ రమణ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి, సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి
తమ గ్రామంలోని 4 కుటుంబాలు గత ఆరు నెలలుగా వేధిస్తున్నాయని, ఇటీవల ఇంట్లోకి చొరబడి 13 మంది మారణాయుధాలతో దాడి చేశారని హిరమండలం మండలంలోని ధనుపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కుటుంబం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణానికి హాని ఉంది, రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిపురం మోహనరావు, దారపు షణ్ముఖరావులకు ప్రభుత్వ చెరువు గర్భంలో నివాసాలతో పాటు స్థలాలున్నాయి. గత కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోందని, ఆర్మీలో పనిచేస్తున్న తన కుమారుడు శ్యామలరావు లేని సమయం చూసి ఈనెల 5న షణ్ముఖరావుతో పాటు 12 మంది గొడవపడి దాడి చేశారని సిరిపురం మోహన్‌రావు ఫిర్యాదు చేశారు. తనని, తన కోడలు శ్రీలతను చంపాలని చూశారని ఆందోళన వ్యక్తం చేవారు. ఇదే విషయమై కొత్తూరు సీఐకి ఫిర్యాదు చేయగా.. సీఐ వారికే మద్దతిస్తూ కేసు కట్టకుండా తిరిగి తమపై కేసు కడతానంటూ బెదిరించారన్నారు. ఇదే విషయమై సాక్షి కొత్తూరు సీఐ ప్రసాదరావును ఫోన్‌లో సంప్రదించగా.. మోహనరావు మొదటగా షణ్ముఖరావుపై కత్తితో దాడి చేశాడని, తర్వాత షణ్ముఖరావు దాడి చేశాడని తెలిపారు. ఇరువైపులా కేసులు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామన్నారు. ఆర్మీ ఉద్యోగి శ్యామలరావుకు సంఘీభావంగా మాజీ సైనిక సంఘ సభ్యులు గ్రీవెన్సుకు వచ్చారు.


