రైతుపై పీడీ యాక్ట్ పెట్టడం అమానుషం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం అనకాపల్లిలోని జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టడం అమానుషమని, ఆయనను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జిల్లా రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్టు పెట్టి 2025 డిసెంబర్ 24 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో నిర్బంధించిందన్నారు. ఏలూరు జిల్లా బుట్టయిగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. అలాగే విశాఖపట్నంలో విద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంపై మండిపడ్డారు. అనంతరం జిల్లా పరిషత్‌లో అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారాపు సింహాచలం, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు డి.చందు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


