నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారం
● డిప్యూటీ కలెక్టర్ పద్మావతి
● పీజీఆర్‌ఎస్‌లో 102 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో ఆర్డీవోలు వెంకటేష్, కృష్ణమూర్తి, కె.సాయి ప్రత్యూషలతో కలిసి 102 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ క్లీనిక్‌పై తహసీల్దార్లకు మరింత అవగాహన అవసరమన్నారు. అర్జీలపై ఎండార్సుమెంట్ వేసినప్పుడు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి అర్జీదారునితో మాట్లాడి ఎండార్సుమెంట్ వేయాలని సూచించారు. రెవెన్యూ – 38, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – 24, పంచాయతీ రాజ్ – 7, సర్వే అండ్ లాండ్ రికార్డులు – 6, ఏపీఈపీడీసీఎల్ – 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – 3, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ – 3, వ్యవసాయ శాఖ – 5, మెడికల్ ఎడ్యుకేషన్ – 2, కార్మిక శాఖ – 2, ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్, పోలీసు, లీగల్ మెట్రాలజీ, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెలవెలబోయిన గ్రీవెన్స్
ఈ వారం గ్రీవెన్సు వెలవెలబోయింది. కలెక్టర్, జేసీ వంటి అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈవారం గ్రీవెన్సులో పాల్గొనలేదు. అంతేకాకుండా ఈవారం సంక్రాంతి ముందు వారం కావడంతో చాలా మంది అర్జీదారులు రాలేదని తెలుస్తోంది. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానిని ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ కూడా వెలవెలబోయింది.


