అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.


