అలుగును చంపిన కేసులో మూడేళ్ల జైలుశిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో అరుదైన అలుగు జంతువును చంపి మాంసం తిన్నట్లు రుజువు కావడంతో అదే గ్రామానికి చెందిన రత్నాల జయరాంకు పలాస జూనియర్ సివిల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు టెక్కలి అటవీశాఖ రేంజర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. 2015లో అలుగును చంపిన జయరాంపై వైల్డ్ లైఫ్ యాక్ట్–1972 కింద అప్పటి రేంజ్ అధికారి సంజయ్ కేసు నమోదు చేయగా.. మంగళవారం కోర్టు తుది తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అటవీ జంతువులను హతమార్చితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కె.మత్స్యలేశం తీరానికి భారీ సొరచేప
ఎచ్చెర్ల: డి.మత్స్యలేశం పంచాయతీ కె.మత్స్యలేశం సముద్రం ఒడ్డుకు మంగళవారం భారీ సొరచేప కొట్టుకొచ్చింది. కొన ఉపిరితో ఉన్న చేపను రక్షించేందుకు స్థానికులు సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడటంతో ముందుకు కదల్లేని పరిస్థితిలో ఉంది. కాసేపటికే చేప చనిపోయినట్లు మత్స్యకారులు గుర్తించారు. సుమారు 3 వందల కిలోలపైగా ఉన్న ఈ చేప తినేందుకు ఉపయోగపడదని మత్స్యకారులు తెలిపారు.
వజ్రపుకొత్తూరు రూరల్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జక్కల తోష్నిరాయ్ ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ వీక్ నేషనల్ చాంపియన్‌షిప్–2025 పోటీలలో 300 మీటర్ల రోలర్ స్కేటింగ్ విభాగంలో ఈమె సత్తాచాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జక్కల గోపాలకృష్ణ, చంద్రవతి దంపతుల కుమార్తె తోష్నిరాయ్ ప్రతిభ కనబరచడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.
అలుగును చంపిన కేసులో మూడేళ్ల జైలుశిక్ష


