అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● 163 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాధితులు ఇచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుంచి 163 అర్జీలు స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ–61, రెవెన్యూ–37, పంచాయతీ రాజ్–13, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ – 13, ఏపీ ఈపీడీసీఎల్–6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్–3, సమగ్ర శిక్ష–3, వ్యవసాయ శాఖ–3, గ్రామీణాభివృద్ధి–2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్–2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్–2, కుటుంబ సంక్షేమం–2, వాటర్ రిసోర్సెస్ ఏజెన్సీ–2, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆర్‌డబ్ల్యూఎస్, మత్స్యశాఖ, దేవదాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి, విద్య, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు, ఆర్టీసీకి సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వినతులు పరిశీలిస్తే...
● తమ గ్రామంలో పొజిషన్ ధ్రువపత్రాన్ని టాంపరింగ్ చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన పి.పద్మనాభం ఫిర్యాదు చేశారు.
● నందిగాం మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కూరు మీన తనకు రావాల్సిన అంగన్‌వాడీ ఆశా కార్యకర్త పోస్టులో కనీసం ఇంటర్వ్యూకి హాజరవ్వని టి.రమాదేవిని అధికారులు నియమించారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తను ఈ విషయమై రెండోసారి పీజీఆర్‌ఎస్‌కి రావడం జరిగిందని, తనకు న్యాయం జరగలేదని వాపోయారు.
● పురపాలక సంఘం పరిధిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న పార్టు టైం వర్కర్లకు ఇతర పార్ట్ టైం వర్కర్లు మాదిరిగా వేతనం ఇవ్వాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పార్ట్ టైం వర్కర్లు టి.పార్వతి, ఎస్.భాను, ఎం.తవిటమ్మ, వి.కృష్ణవేణిలు కోరారు.
● పోలాకి మండలంలోని రెహమాన్‌పురం గ్రామానికి చెందిన పూడి అప్పలనాయుడుకి రెహమాన్‌పురం రెవెన్యూలో సర్వే నంబర్ 165–5లో సుమారుగా 0.53 సెంట్లు భూమి ఉందని, ఆ భూమికి తనకు అనువంశకరంగా సంక్రమించిదని, ఆ భూమికి తనకు పాస్ పుస్తకం, అడంగల్, 1–బీలను ఇప్పించాలని కోరారు.
● ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీఐలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ సీనియర్లు వేధింపులు, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ప్రత్తిపాటి సృజన్ కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, తదితరులు పీజీఆర్‌ఎస్‌లో కోరారు.
● పొందూరు మండలంలోని కృష్ణాపురం, రాపాకలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం.శంకరరావు అవితినీతికి పాల్పడి, అడ్డగోలుగా అడంగల్ మంజూరు చేస్తున్నారని గ్రీవెన్స్‌లో రైతులు కలెక్టరుకి వినతిపత్రం అందించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని జి.నాగేశ్వరరావు, సత్యప్రభ, విజయలక్ష్మి, మధుసూదనరావు తదితరులు కోరారు.


