రిమ్స్ కాంట్రాక్టర్స్ లైసెన్సులు రద్దు చేయాలి
● అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాశ్ డిమాండ్
● రిమ్స్ గేటు వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం: రిమ్స్ ఆస్పత్రిలో గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా సెక్యూరిటీ గార్డ్స్‌పై నిరంకుశంగా వ్యవహరిస్తున్న శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం లేబర్ లైసెన్సు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిమ్స్ గేటు వద్ద కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో వివిధ రకాల కాంట్రాక్టర్లు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులన్నా.. ప్రజాప్రతినిధులన్నా ఏమాత్రం గౌరవం లేదని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని పేర్కొన్నారు. ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మాట్లాడుతూ.. జీవో 138 ప్రకారం రూ.18,600ల కనీస వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లు నియంతల్లా వ్యవహరించి కార్మికుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డ్స్‌కి గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని, లేనిపక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పోరాటానికి సంఘీభావం
కార్మికుల రిలే దీక్షా శిబిరాన్ని ఐఏఫ్టీయూ ఏపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. నిరవధికంగా పోరాటం సాగించాలని, దశల వారీ పోరాటానికి సిద్ధపడా లని పిలుపునిచ్చారు. యాజమాన్యం తక్షణమే కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జోగి వెంకటరమణ, గురుగుబెల్లి లక్ష్మణరావు, మామిడి సూర్యనారాయణ, మిర్తిపాటి హైమారావు, సంధ్య, కాపురెడ్డి రాజేశ్వరి, శాంతి కుమారి, దుర్గాప్రసాద్, మోహనరావు, నరసింగరావు, కొప్పుల రాజశేఖర్, హేమలత, ఎస్.సుమతి, యూనియన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజులు, ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, మద్ది శ్రీను సిరిపల్లి ప్రసాద్, తనుకు సంతోషి, బండారి శశికళ, గోవిందమ్మ, సాదు శ్రీనివాస్, దామోదర రవి కుమార్, తాళ్లవలస రామారావు, సతివాడ రాజేంద్రప్రసాద్, బన్నా అప్పన్న, అన్నేపు సూర్యనారాయణ, తిరుమలరావు, చిన్నారావు జయప్ర ద, భాస్కరరావు బీబీ మాధవరావు పాల్గొన్నారు.


