ఆన్‌లైన్ సేవలు విస్తృతం..!
● అరసవల్లిలో మనమిత్ర క్యూఆర్ కోడ్
సదుపాయం
● ఆన్‌లైన్ సేవల రిజర్వేషన్‌కు మార్గం సుగమం
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యదేవాలయం అరసవల్లిలో ఆన్‌లైన్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. 2020 నుంచే సూర్యనారాయణ స్వామివారి ఆలయ సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తుండగా.. తాజాగా ఆలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ‘మనమిత్ర’ పేరిట సిద్ధ చేసిన ఈ క్యూఆర్ కోడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల సమాచారంతో పాటు అక్కడి ఆలయాల్లో దర్శనాల టిక్కెట్లు, సేవల టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసి పొందే అవకాశముంది. దీనికోసం ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలతో పాటు వివిధ రకాల ఆర్జిత సేవా టిక్కెట్లు, సూర్య నమస్కార పూజలు, కల్యాణం, అభిషేక సేవల టిక్కెట్లను కూడా మనమిత్ర పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు పొందేందుకు, అలాగే ఆయా ఆలయాల్లో పర్వదినాలు, వివరాల కోసం అధికారికంగా ప్రత్యేక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్ పనిచేస్తోంది. అయితే ఈ ప్రముఖ ఆలయాల జాబితాలోకి అరసవల్లి చేరడంతో ఆన్‌లైన్ సేవలను దేశం నలుమూలల నుంచి పొందే అవకాశం ఉంది. ఆదిత్యాలయంలో సేవలను, దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు
అరసవల్లి ఆలయంలో ఆన్‌లైన్ సేవలను పొందేందుకు వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. దేశం నలుమూలల నుంచి ఇక్కడి ఆలయంలో ఆర్జిత సేవలను, టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చాం. రానున్న రోజుల్లో ఈ ఆన్‌లైన్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
– కేఎన్‌వీడీవీ ప్రసాద్, ఈవో, ఆరసవల్లి ఆలయం
ఆన్‌లైన్ సేవలు విస్తృతం..!


