
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కష్టాలు పెరిగాయని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎరువులకు కొరత ఏర్పడితే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మొదటి విడతకే పరిస్థితి ఇలా ఉంటే రెండో విడత ఎరువులు పంపిణీ ఏంటని ఆందోళన వ్యక్తం చేశా రు. ఒక యూరియా బస్తా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారని, కూటమి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఆర్‌బీకేలో అవసరం మేరకు ఎరువులు ముందుగానే సిద్ధం చేసేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైందని అన్నారు. రైతుల పట్ల ఇంత కక్ష కట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నా రు. ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి కింద రూ.20 వేలు ఇస్తామని ప్రకటన చేశారని, ఒక ఏడాది ఎగ్గొట్టేశారని, ఈ ఏడాది కూడా కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇదివరకు ఉ న్న ఉచిత బీమా పథకాన్ని ఎత్తేయడం దారుణమ న్నారు. దీంతో జిల్లా రైతులపై రూ. 5 కోట్లు వరకూ భారం పడిందని అన్నారు. గత ఖరీఫ్‌లో దిగుబడి అయిన ధాన్యంలో సగానికి పైగా ధాన్యాన్ని కొనకుండా రైతులకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఆర్‌బీకేలను కూడా నిర్వీర్యం చేశారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ ఆరంగి మురళి, పార్టీ నాయకులు చింతు రామారావు, కనిత కృష్ణారావు, రాజాపు అప్పన్న, సురంగి నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్