
కాపుగోపాలపురంలో చైన్‌స్నాచింగ్
పాతపట్నం : చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దాడులకు ఎగబడుతున్నారు. పాతపట్నం మండలం కాపు గోపాలపురంలో సోమవారం సాయంత్రం చైన్‌స్నాచింగ్ చోటుచేసుకుంది. పాతపట్నం మేజర్ పంచాయతీ కోటగుడి కాలనీకి చెందిన దంపతులు కాళ్ల జ్యోతి, నారాయణరావులు పశువులకు కుడితి పెట్టడానికి కాపుగోపాలపురంలోని నీలకంఠేశ్వర ఆలయం సమీపంలోని పశువులశాల వద్దకు బైక్‌పై వెళ్లారు. భార్యని దించేసి నారాయణరావు కాపుగోపాలపురం వచ్చేశారు. జ్యోతి పశువుల శాల వైపు కుడితి పెట్టడానికి బకెట్‌తో వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై ఇద్దరు దొంగలు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. జ్యోతి కేకలు వేసేసరికే పర్లాకిమిడి వైపు పారిపోయారు. రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ జరిగిందని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు.