
జాప్యానికి సిగ్గుపడుతున్నాం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పనుల్లో జాప్యం జరగడంపై సిగ్గుపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అయితే దీనివెనుక సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల సెమినార్ కమ్ వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించలేకపోతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఐదు జోనల్ పరిధిలో గ్రిగ్స్‌మీట్‌ల నిర్వహణకు అవసరమైన రూ. 5లక్షల నిధులను మంజూరుకు కలెక్టర్‌తో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉప విద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి (శ్రీకాకుళం), పి.విలియమ్స్(టెక్కలి) మాట్లాడుతూ పీడీ–పీఈటీలకు పాఠశాలల్లో క్రీడల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారిస్తామన్నారు.
అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ స్కూల్ గేమ్ ఫెడరేషన్, గ్రిగ్స్ పోటీల కోసం జిల్లా, డివిజన్, నియోజకవర్గం స్థాయి క్రీడల నిర్వహణ తలెత్తుతున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, సంపతిరావు సూరిబాబు, మెట్ట తిరుపతిరావు, తవిటయ్య, రాజారావు, శేఖర్‌బాబు, నారాయణరావు, జగదీష్, నిర్మల్‌కృష్ణ, హెచ్‌ఎంలు హరిబాబు, పోలినాయుడు, ఎమ్మెస్ చంద్రశేఖర్, ఎంఈఓ సోంబాబు, విజయనగరం జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకట్‌నాయుడు, నియోజకవర్గ, మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు.
పీడీ–పీఈటీ వర్క్‌షాప్ ప్రారంభంలో ఎమ్మెల్యే శంకర్
గ్రిగ్స్‌మీట్ క్రీడాపోటీలకు రూ.5లక్షలు మంజూరు చేయిస్తామని హామీ
నిధులు కేటాయించండి..
జోన్–1 పరిధిలో రీజనల్ ఇన్‌స్పెక్షర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐ పీఈ) పోస్టును ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. గ్రిగ్స్‌మీట్‌లను ఐదు జోన్‌ల పరిధిలో నిర్వహించేందుకు కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలి. స్కూల్‌గేమ్స్ ఎంపికల పోటీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ బిల్డింగ్ కోసం కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు