
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
టెక్కలి రూరల్: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, రెండు రోజులుగా టెక్కలిలోనే తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమీప షాపుల బయట పడుకుని ఉదయం వెళ్లిపోయాడని, మధ్యాహ్నానికి మృతి చెంది కనిపించాడని అంటున్నారు. మృతుడు నీలం టీషర్టు, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ రాము కోరారు.
బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి
● గోవాలో ఘటన
వజ్రపుకొత్తూరు: పల్లివూరు పంచాయతీ హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు కారి రాజులు(44) గోవాలో శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులు స్థానికంగా వేట సాగకపోవడంతో గోవాకు వలసవెళ్లాడు. అక్కడ శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో వేట సాగిస్తుండగా అలల ధాటికి బోటు బోల్తా పడింది. బోటు కిందే రాజులు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాజులు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా, భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు స్వాతి, స్వప్న ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవా పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని గ్రామానికి పంపిస్తారని స్థానికులు తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం