
ఆదర్శ విప్లవకారుడు మాధవరావు
పలాస: పేద కటుంబంలో పుట్టి జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఆదర్శ విప్లవకారుడు గోరు మాధవరావు అని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పి.డి.ఎం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో మంగళవారం గోరు మాధవరావు, ఎన్.క్రాంతికుమార్‌ల సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. పి.డి.ఎం.జిల్లా నాయకుడు సాలిన వీరాస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎ.ఐ.ఆర్.పి.ఎఫ్ ఆలిండియా అధ్యక్షుడిగా పనిచేసిన మాధవరావు అంతకుముందు శ్రీకాకుళం ఉద్యమంలో కూడా పాల్గొన్నారని, సుమారు 50 ఏళ్లు ప్రజల కోసం పనిచేసి జైలు జీవితం అనుభవించారని చెప్పారు. క్రాంతికుమార్ పి.డి.ఎం.లో పనిచేశారని, అతని త్యాగాలను వివరించారు. కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర నాయకుడు జోగి కోదండరావు, పౌర హక్కుల సంఘం నాయకుడు స్వామినాథం, పి.కె.ఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్మారావు, దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచనరావు, మురిపింటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.