
34 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి ముంబైకి 34.32 కిలోల గంజాయి తరలిస్తున్న సంతున్ దాసు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, పోలీసు సిబ్బంది మంగళవారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్, చిదంబరీశ్వర ఆలయ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఖరియాగూడా ప్రాంతానికి చెందిన సంతున్‌దాసు అనుమానాస్పదంగా కనిపించడంతో లగేజీని తనిఖీచేశారు. అందులో 34.32 కిలోల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారించారు. తన గ్రామంలోని రైతుల వద్ద గంజాయి కొని ముంబైలోని లొబొకుండ అనే వ్యక్తికి అందజేసేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. గంజాయితోపాటు ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు.