
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి ● పెంటూరులో విషాదఛాయలు
నరసన్నపేట: సత్యవరంలో జాతీయ రహదారి ఫ్‌లై ఓవర్ వంతెనపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి పిన్నింటి దొరబాబు(38) మృతి చెందారు. శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామంలో అమ్మవారి పండగలకు వెళ్లి స్వగ్రామం నందిగాం మండలం పెంటూరుకు ద్విచక్ర వాహనంపై మామయ్య సనపల సీతారాంతో కలిసి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే దొరబాబు మృతి చెందగా.. సీతారాంకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు.
మూడు రోజుల్లో విధుల్లోకి..
దొరబాబు అస్సాం రైఫిల్ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. బంధువుల కుమార్తె పెళ్లికి వారం రోజులు సెలవుపై వచ్చారు. వివాహ వేడుక రెండు రోజుల కిందటే కాగా, శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో అమ్మవారి పండగలకు వెళ్లారు. మరో మూడు రోజుల్లో తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో మృత్యువు వెంటాడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దొరబాబుకు భార్య కాంచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.