
ఇవేం ‘పనులు’!
● ఉపాధి కూలీలు చేసిన పనులకే కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు ● సాగునీటి సంఘాల పేరుతో అక్రమాలకు దిగిన కూటమి నాయకులు ● ఆమదాలవలసలో కొనసాగుతున్న అధికార పార్టీ దందా
ఆమదాలవలస రూరల్:
కూటమి పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అక్రమ సంపాదనకు ఎంతకై నా వెనుకాడరని ఉపాధి హామీ పథకం, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఆమదాలవలస మండలంలో ఉపాధి హామీ వేతనదారులు చేసిన పనులకే మళ్లీ నీటిపారుదల శాఖ ద్వారా కొత్తగా ప్రతిపాదనలు చేసి అరకొరగా మెరుగులు దిద్ది అక్రమాలకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని నారాయణపురం ఎడమ కాలువ ద్వారా జంబోదీపం నుంచి దూసి వరకు పిల్ల కాలువలో ఇటీవల ఉపాధి పనులు చేపట్టారు. కలివరం, దూసి పంచాయతీలకు చెందిన ఉపాధి వేతనదారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ పనులు చేసేందుకు మూడు బిట్లుగా విభజించి ఒక్కో బిట్‌కు సుమారు రూ.8.5 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.20 లక్షలు వరకు ఉపాధి కూలీలకు వేతనాలు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. పట్టుమని నెల రోజులు గడవ ముందే నీటిపారుదల శాఖ ద్వారా సుమారు రూ.10 లక్షలు వరకు అంచనాలు తయారు చేయించారు. అదే కాలువలో కూటమి కాంట్రాక్టర్లు సాగునీటి సంఘాల పేరుతో జేసీబీతో పనులు చేయిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడే కాకుండా, మండలంలో పలు చెరువుల వద్ద కూడా ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి.
ఉపాధి నిధులు దుర్వినియోగం..
కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఉపాధి నిధులు కూటమి నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం, కొల్లివలస, చిట్టివలస, కలివరం తదితర గ్రామాల్లో అవసరం లేని చోట పనులు ప్రతిపాదన చేయటమే కాకుండా నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు కూడా రహదారులు వేయించుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మండలంలో ఉపాధి పనులు చేసిన చోట కొత్త ప్రతిపాదనలు రద్దు చేయటమే కాకుండా ఉపాధి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
మాకు సంబంధం లేదు..
మండలంలోని జంబోదీపం పిల్ల కాలువ పనులతో పాటు అనేక చోట్ల ఉపాధి కూలీలు చేసిన పనులకే సాగునీటి సంఘాలు ద్వారా కొత్త ప్రతిపాదనలు రావడంపై ఏపీఓ ఎం.అప్పలనరసమ్మ వద్ద ప్రస్తావించగా మండలంలో అన్ని సాగునీటి కాలువల పనులు చేసి కూలీలకు వేతనాలు కూడా చెల్లించామని చెప్పారు. ఇప్పుడు అదే చోట పనులుకు ప్రతిపాదనలకు రావడం మాకు సంబంధం లేదని, మా శాఖ ద్వారా చేసిన పనుల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించామని చెప్పారు
అక్రమాలు అడ్డుకోవాలి..
అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఉపాధి నిధులు దారి మళ్లిస్తున్నారు. ఉపాధి కూలీలు చేసిన పనులకు మరలా కొత్త ప్రతిపాదనలు చేసి బిల్లులు పొందుతుండటం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు రహదారులు అక్రమంగా వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం.
– చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ
ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త

ఇవేం ‘పనులు’!

ఇవేం ‘పనులు’!

ఇవేం ‘పనులు’!