
సముద్రంలో వ్యక్తి గల్లంతు
రణస్థలం : మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సరదాకు స్నానానికి వెళ్లి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్ (31), ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ కలిసి కందివలస గెడ్డలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీరు బాగోలేదని సమీపంలోని దోనిపేటలో సముద్ర స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి తొలుత నీలాపు రమణ మునిగిపోతుండగా గమనించిన సూర్యనారాయణ, సంతోష్‌లు కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యనారాయణ, రమణ ఒడ్డుకు చేరుకున్నా సంతోష్ మాత్రం మునిగిపోయాడు. చాలాసేపు వెతికినా సంతోష్ జాడ కానరాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. జె.ఆర్.పురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాలించినా సంతోష్ ఆచూకీ దొరకలేదు. సంతోష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమారులు సిద్దార్ధ, హర్షవర్దన్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ గల్లంతయ్యాడని తెలిసి తల్లిదండ్రులు రాము, సరస్వతి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి గతంలో పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్‌లో కెమిస్ట్‌గా పని చేసి హైదరాబాద్ వెళ్లాడు. మళ్లీ స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగం సాద్ధిద్దామనే ఉద్దేశంతో నెల రోజుల కిందట గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.