ఒడిశాకు తరలుతున్న పశుగ్రాసం
పాతపట్నం: పాతపట్నం పరిసర ప్రాంతాల నుంచి వరి గడ్డివాములు ట్రాక్టర్లతో ఒడిశాకు తరలిస్తున్నారు. ఒడిశాలో వరి గడ్డి(పశుగ్రాసం)కి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటుతోంది. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల నుంచి ప్రతి రోజు సాయంత్రం, రాత్రి పూటల్లో ఒడిశాకు వరిగడ్డి ట్రాక్టర్‌లు ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇటీవల వరి పంటలు యంత్రాలతో వరి చేను కోయడం వల్ల వరి గడ్డికి డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా ట్రాక్టర్ వరి గడ్డి రూ.5 వేలు నుంచి రూ.7 వేలు వరకు ధర ఉంది.
దీంతో దళారులు ఇక్కడి రైతులతో వీలైనంత మేర కొనుగోలు చేసి, ఒడిశాకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, వేసవిని దృష్టిలో ఉంచుకుని గడ్డి కొరత రాకుండా ప్రభుత్వమే రైతుల నుంచి గడ్డి సేకరించి, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పాడి రైతులు సూచిస్తున్నారు.


