మహిళా క్రికెట్‌లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌లో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు

Published Sat, Mar 9 2024 8:50 AM | Last Updated on Sat, Mar 9 2024 2:10 PM

- - Sakshi

అండర్‌–15, అండర్‌–19లో ప్రతిభ కనబరుస్తున్న మన క్రీడాకారిణులు

 ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లోనే చదువులు

కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జన్మించిన ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు క్రికెట్‌లో అత్యున్నత రీతిలో రాణిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగి అండర్‌–15, అండర్‌–19 విభాగాల్లో ఆడు తూ ఈ ప్రాంతానికి మంచి పేరు సంపాదించిపెట్టారు. కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు బొగియా కామరాజు–స్వరూపల కుమార్తెలు బొగియా సాయిదీప్తి, బొగియా సాయినిఖితలు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ మీద మక్కువ పెంచుకున్నారు. తండ్రి కామరాజు మకరాంపురం టీంలో యాక్టివ్‌ క్రీడాకారుడు.

ఆ క్రీడ మీద ఉన్న మక్కువతోనే తన కుమార్తెలిద్దరికీ ఆ క్రీడలో తర్ఫీదునిచ్చి ప్రోత్సహించారు. వీరిద్దరూ ఐదో ఏట నుంచే మైదానంలో క్రికెట్‌ ఆడటం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఆడుకుంటూ చక్కని ప్రతిభను కనబరుస్తూ ఈ రోజు జాతీయ స్థాయిలో ఆడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెద్ద కుమార్తె సాయిదీప్తి అండర్‌–19 విభాగంలోను, చిన్నకుమార్తె సాయి నిఖిత అండర్‌–15 విభాగంలో ఆడుతున్నారు. వీరిలో సాయిదీప్తి మంగళగిరిలో గల ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఎంపీసీ), రెండో కుమార్తె సాయి నిఖిత గుంటూరు ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌లో 8వ తరగతి చదువుతోంది. ఓవైపు చదువుకుంటూ.. మరోవైపు క్రికెట్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు.

జాతీయ స్థాయిలో రాణింపు..
సాయిదీప్తి అండర్‌–19 విభాగంలో ఆడుతూ ప్రతిభను కనబరుస్తోంది. ప్రస్తుతం ఈమె జాతీయస్థాయిలోను, ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌లలో ఆడుతోంది. లెఫ్ట్‌ హ్యాండ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తోపాటు రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌గా రాణిస్తోంది.

ఇటీవల స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ మ్యాచ్‌లో 54 బంతుల్లో 117 పరుగులు, 24 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీయడంతో నిర్వాహకులు అభినందించి, షీల్డ్‌ను అందజేశారు. ఆల్‌ ఇండియా క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ వుమెన్స్‌ పోటీల్లో ఆరు వికెట్లు తీసుకొని మన్ననలు పొందింది. ఆంధ్రా–చంఢీగడ్‌ల మధ్య జరిగిన పోటీలో సాయిదీప్తి బౌలింగ్‌ చేసి 7.3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. సాయిదీప్తిని మకరాంపురం గ్రామస్తులు శనివారం స్థానిక శివాలయంలో సత్కరించనున్నారు.

జోనల్‌ స్థాయిలో..
అండర్‌–15 విభాగంలో సాయి నిఖిత పాఠశాల స్థాయిలోనే చక్కని ప్రతిభను కనబరుస్తోంది. జోనల్‌స్థాయిలో రాణిస్తోంది. ఈమె లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేయడం, రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్‌ కీపర్‌గా కూడా రాణిస్తోంది. ఉద్దానం ప్రాంతంలో పేద కుటుంబానికి చెందిన క్రీడాకారుడి కుమార్తెలిద్దరూ ఇంతటి ఘనవిజయం సాధిస్తూ ముందుకెళ్లడంతో స్థానికులు సైతం హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కుమార్తెలిద్దరితో బొగియా కామరాజు–స్వరూప దంపతులు 1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement