హర్షవల్లి నుంచి అరసవల్లి వరకు
పురాతన అరసవల్లి ఆలయం
అరసవల్లి/శ్రీకాకుళం కల్చరల్: హర్షవల్లి నుంచి అరసవల్లి వరకు ఆదిత్యుని క్షేత్రం కాల పరీక్షలను తట్టుకుని నిలబడింది. వేల ఏళ్లుగా విరాజిల్లుతోంది.
ఆలయం దేవేంద్ర నిర్మితమని పురాణాలు చెబుతున్నాయి. అయితే 7వ శతాబ్దంలో ఆలయ తొలి నిర్మాణం జరిగినట్లుగా శాసనాలు చెబుతున్నాయి.
గంగ వంశరాజు గుణశర్మ వారసుడైన కళింగరాజు దేవేంద్రవర్మ క్రీస్తుశకం 63వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని ఇక్కడ లభించిన శాసనాలు చెబుతున్నాయి.
క్రీస్తుశకం 16వ శతాబ్దంలో హర్షవల్లి ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్, తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు, మహమ్మద్ ఖాన్, హర్షవల్లిపై దండెత్తుతాడని తెలుసుకుని, గర్భాలయంలోని మూలవిరాట్టును సమీప బావిలో పడేశారట.
క్రీస్తుశకం 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు ఆ బావిలో సూరీడి మూలవిరాట్టును గుర్తించి, తర్వాత ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారు.
అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా 1999 సంవత్సరంలో జిల్లాకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి దివంగత వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని పడ గొట్టి, దక్షిణాది పద్ధతిలో కాకుండా ఓడ్ర (ఒడిషా) సంప్రదాయంతో నిర్మించారు. నాలుగు రథచక్రాలతో రథారూఢుడై దర్శనమిస్తున్నట్లు ఆలయ నిర్మాణమై ఉంటుంది.
వంశపారంపర్యంగా ఈ దేవాలయ అర్చకత్వ బాధ్యతలను ఇప్పిలి వంశీయులు నిర్వర్తిస్తుండగా, ప్రస్తుతం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఆలయ ప్రధానార్చకులుగా ఇప్పిలి శంకరశర్మలు వ్యవహరిస్తున్నారు.


