రూ. 16.85 లక్షలకు టోకరా
శ్రీకాకుళం క్రైమ్ : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట వరుస సైబర్ మోసాలు శ్రీకాకుళం వాసులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా సోమవారం పీఎన్‌కాలనీకి చెంది న ఓ గృహిణి అలాంటి మోసానికి గురై రూ.16.85 లక్షలు పోగొట్టుకున్నట్లు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది నవంబరు 14న యూట్యూబ్‌లో ఓ లింక్ రావడం, క్లిక్ చేయగా ఓ గ్రూపుగా క్రియేట్ అవ్వమని, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో టిప్స్ చెబుతామని చెప్పడంతో ఆమె గ్రూప్‌లో యాడ్ అయ్యా రు. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మెసేజ్‌లు, ఫోన్ల ద్వారా క్లాసులు చెప్పేవారు. ఈ క్రమంలో ఆమెకు డీమాట్ అకౌంట్ ఓపెన్ చే యమని, దాని ద్వారా షేర్లు కొంటే అధిక వడ్డీలతో నగదు వస్తుందని ఆశచూపారు. అది నమ్మి డిసెంబరు 27న రూ. 50 వేలు వేశారు. దఫదఫాలుగా ఈనెల 13 వరకు రూ. 16.85 లక్షలు వేశారు. ఎప్పటికీ షేర్లు అధిక ధరకు వెళ్లకపోవడంతో క్లోజ్ చేస్తానని, తన డబ్బులు వేసేయమని చెప్పినా అవతలి వాళ్లు షేర్లు కొనాల్సిందేనని పట్టుబట్టారు. మోసపోయానని గ్రహించిన గృహిణి ఈ నెల 16న 1930 సైబర్‌సెల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సోమవారం రాత్రి తమకు ఫిర్యాదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ఇటీవల నగరంలో ఇలాంటి మోసాలకు గురైన వారంతా ఒకే గ్రూపులో సభ్యులుగా ఉన్నవారేనని, మరికొందరు సైతం ఫిర్యాదులు చేసేందుకు అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సైబర్
మోసం


