హిందూపురం టౌన్: ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన హిందూపురం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్‌ఐ ప్రసన్న వివరాల మేరకు... పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో హిందూపురం–బెంగళూరు మార్గంలో ఓ రోడ్డు బ్లాక్ చేశారు. దీంతో ఒకే రోడ్డులోనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం కర్ణాటక ఆర్టీసీ బస్సు మరో రోడ్డులో ఎదురుదిశలో వేగంగా ప్రయాణించగా, అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన సురేష్ (29) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. క్షతగ్రాతుడిని ఆటోలో నుంచి బయటకు లాగడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అతడిని హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతుడి భార్య ప్రస్తుతం గర్భిణి. సురేష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
యువకుడి మృతి


