ధర్మవరం రూరల్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సం సందర్భంగా జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ప్రకటించిన స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026–27లో ధర్మవరం మండలం చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరికొత్త రికార్డు సృష్టించింది. క్రీడారంగంలో నిరంతర ప్రతిభ కనబరుస్తూ ఈ పాఠశాల వరుసగా మూడోసారి జిల్లా స్థాయి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డి, పీడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కమిటీ పరిశీలన అనంతరం చిగిచెర్ల ఉన్నత పాఠశాల ఏకంగా 226 పాయింట్లతో జిల్లాలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. పుట్టపర్తిలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఈఓ కృష్టప్ప, ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులకు ప్రథమ బహుమతితో పాటు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా పాఠశాల జిల్లాలోనే నంబర్‌వన్‌గా నిలవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీ ప్రతాప్‌రెడ్డిని, ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డిని, ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు అభినందించారు. పాఠశాల విద్యార్థులను మరింతగా ప్రోత్సహించి మరిన్ని విజయాలు అందేలా చూడాలన్నారు.


